Home » General »  అంబేద్కరిజం – స్టేట్ సోషలిజం

 అంబేద్కరిజం – స్టేట్ సోషలిజం

Start here

Advertisements

🔷🔹🔷 అంబేద్కరిజం – స్టేట్ సోషలిజం 🔷🔹🔷       భారత సమాజంలో తెరముందు కనిపించే ఎన్నో సామాజిక రుగ్మతలకు మూలాలు, తెరవెనుక వేల సంవత్సరాలుగా కొన్ని కుల సమూహాల ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యంతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం దేశాన్ని శాసిస్తున్న బ్రాహ్మణ వ్యవస్థ తీరును అర్థం చేసుకోవడానికి కేవలం సామాజిక కోణాన్నే కాకుండా, ఆర్థిక కోణాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది.. కులనిర్మూలన, రాజకీయ అధికారం ఇత్యాది అంశాలతో పాటు ఆర్థిక – రాజకీయ లక్ష్యాలను నిర్ధేశించే ఉద్దేశంతో బాబాసాహెబ్ ప్రతిపాదించిన “స్టేట్ సోషలిజాన్ని” అధ్యయనం చేయకపోతే “అంబేద్కరిజం” అసమగ్రంగా మిగిలిపోతుందని గుర్తించాలి.. 

✿ స్టేట్ సోషలిజం – ప్రస్తుత ప్రాముఖ్యత ✿

☞ SC, ST, BCలు సైద్ధాంతిక సారూప్యతతో ఐక్యం అవుతూ రాజకీయ శక్తిగా అవతరించే దిశగా అడుగేస్తున్న ఈ తరుణంలో నిర్థిష్టమైన లక్ష్యాలపై అవగాహన ఏర్పరచుకునేందుకు స్టేట్ సోషలిజం ఉపయోగపడుతుంది.. 

— ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ అధికారం తాత్కాలికమైనది అనే విషయం గుర్తుంచుకోవాలి., కేవలం రాజకీయ అధికారం సాధించడంతోనే తరతరాల సమస్యలకు పరిష్కారం కాలేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.. కానీ లక్ష్యాలను సాధించేందుకు రాజకీయ అధికారం ఒక ప్రముఖమైన వనరుగా ఉపయోగించుకో గలగాలంటే లక్ష్యాల పట్ల అవగాహన అత్యవసరం..

☞ ఆర్థిక పోరాటాలు – సామాజిక ఉద్యమాల ఉమ్మడి ప్రణాళికను సూచించే, కమ్యూనిస్టు – అంబేద్కరిస్టుల కలయిక మీద చర్చ జరుగుతున్న సమయంలో, అసలు అంబేద్కరిజం అంటే పూర్తి అవగాహన కలిగి ఉండకపోతే, “మళ్ళింపు శక్తుల” కుట్రలకు బలయ్యే ప్రమాదం ఉంది.. 

— నిజానికి అంబేద్కరిజం అంటే కేవలం సామాజిక అంశాలపై మాత్రమే ఉద్యమం కాదు.. ఆర్థిక అంశాల పట్ల, ఉద్యమ స్వరూపాల పట్ల కమ్యూనిజం కంటే అంబేద్కరిస్టు సిద్ధాంతానికే విస్తృతమైన పరిజ్ఞానం ఉంది.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినంత అధ్యయనం, చేసినన్ని సూత్రీకరణలూ, ఏ కమ్యూనిస్టు సిద్ధాంతకర్తా చేయలేదనే విషయం కమ్యూనిస్టులు కూడా కాదనలేని నిర్వివాదాంశమే.. 

— కాబట్టి అంబేద్కరిస్టుకు ఆర్థిక ఉద్యమాల సైద్ధాంతిక నిర్మాణం కోసం కమ్యూనిస్టుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేకపోగా, భారతీయ సమాజానికి కమ్యూనిజాన్ని అన్వయించుకునేందుకు కమ్యునిస్టులకే అంబేద్కరిస్టు సిద్ధాంతం సహాయం చేయగలదు.. ఏదేమైనా లాల్-నీల్ కలయిక పరస్పర సహకారంతో ముందుకువెళ్ళడం ప్రయోజనకరమే అయినప్పటికీ, కమ్యూనిస్టులతో గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించడమే మంచిది ..

☞ నయా ఆర్థిక సంస్కరణలలో భాగంగా “లిబరలైజేషన్” “ప్రైవేటైజేషన్”, “గ్లోబలైజేషన్” (LPG) పేరుతో ప్రభుత్వాలను నడుపుతున్న శక్తుల ప్రోద్బలంతో, ప్రభుత్వాలే దళారులుగా వ్యవహరిస్తూ, సంపదలో ప్రజల భాగాన్ని కొన్ని కులాలకు దోచిపెట్టడం జరుగుతుంది.. ఈ సమయంలో 80% బాధితులకు న్యాయం చేసే సమ్మిళిత ప్రగతి సాధించి, ఆర్థిక సమానత్వం నెలకొల్పడానికి స్టేట్ సోషలిజం నిజమైన ప్రత్యామ్నాయం..

✿ స్టేట్ సోషలిజం – నిర్వచనం ✿

   — దేశ సంపద, ఆర్థిక సామాజిక వనరులు, పారిపాలనా యంత్రాంగం ఇత్యాది అంశాలు, వ్యక్తుల చేతులలో కాక మొత్తం వ్యవస్థ చేత నడిపించబడుతూ ప్రజాబద్ధంగా ఉండాలని సోషలిజం చెబుతుంది.. 

  — ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వాలు ప్రజల ప్రతినిధులే కాబట్టి పై అంశాలు ప్రభుత్వం ఆధీనంలో వ్యవహరించబడాలి.. దీనినే స్టేట్ సోషలిజంగా నిర్వచించబడినది.. 

✿ స్టేట్ సోషలిజం – బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం ✿

☞ బాబాసాహెబ్ 1946లో రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించిన “స్టేట్స్ అండ్ మైనారిటీస్”(States and Minorities) మెమొరాండం ద్వారా “స్టేట్ సోషలిజం” ప్రధాన విధానాలను తెలియజెప్పారు.. 

☞ ఈనాడు “మానవ హక్కులు”గా వ్యవహరించబడుతున్న అంశాలు ఆ రాతప్రతి నుండి గ్రహించినవే.. ప్రజలకు హక్కులు ఇస్తూనే వాటి ఫరిధులు, అవసరమైన విధివిధానాలు నిర్దేశించే అధికారం ప్రభుత్వాలకు ఇవ్వబడింది., అంతే కాక ప్రభుత్వ విధానాలు ప్రాధమిక హక్కులను హరించే క్రమంలో వాటి మీద సుప్రీంకోర్టు అజమాయిషీ కల్పించడం జరిగింది.. 

☞ సామాజిక దురాచారాలను, రుగ్మతలను తొలగించగలగడం ప్రభుత్వ యంత్రాంగాల ద్వారానే సాధ్యం అని బాబాసాహెబ్ బలంగా నమ్మారు.. ప్రజాస్వామ్యంలో అత్యధిక జనాభా యొక్క ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు నడపబడతాయని భావించారు., కానీ వేల ఏండ్ల బ్రాహ్మణత్వ ప్రభావం అంత తేలికగా పోదని భావించి, దానికి పరిష్కారంగా సోషలిస్టు భావనలు ప్రభుత్వాల, చట్టాల ఫరిధికి వదలకుండా రాజ్యాంగబద్ధం చేసే ప్రయత్నం చేసారు.. 

☞ వేలయేండ్లుగా సంపద హక్కు నిరాకరించబడి, నిరంతరం దోపిడీకి పీడనకూ గురైన ప్రజలకు సంపదలో సమన్యాయం చేయకుండా కేవలం ఓటుహక్కు కల్పించడంతో ఒరిగేదేమీ లేదని బాబాసాహెబ్ అభిప్రాయ పడ్డారు.. స్టేట్ సోషలిజం ద్వారా సంపద, వనరులలో సమానమైన వాటాను, న్యాయమైన హక్కుగా కల్పించేందుకు రాజ్యాంగ రచన ద్వారా కృషి చేసే ఆలోచన చేసారు.. ఆయన చేసిన సూచనలు కొన్ని ..

— ముఖ్యమైన, నిర్ణయాత్మక పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి.. ప్రాముఖ్యత లేని పరిశ్రమలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో గానీ లేక ప్రభుత్వం అజమాయిషీ గల సంస్థల ద్వారా కాని నడపాలి..

— భీమా రంగం మీద పూర్తి ప్రభుత్వ అజమాయిషీ కలిగి ఉండి, అది సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల వరకూ ప్రయోజనాలు విస్తరించ గలిగే విధమైన సమర్థత కలిగి ఉండాలి..

— వ్యవసాయంపై ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి.. వ్యవసాయ భూమిని యూనిట్లుగా చేసి, ఉమ్మడి సహకార ప్రణాళికను రూపొందించి.. కుల మత వర్ణాలకు అతీతంగా యూనిట్లు కేటాయించాలి..

— ప్రభుత్వం వ్యవసాయానికి కావలసిన సౌకర్యాలు సమకూర్చే బాధ్యత తీసుకోవాలి.. మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలి..

– ఈ పద్ధతి వలన భూస్వాములు ఉండరు, కౌలుదారులూ ఉండరు, భూమిలేని రైతు కూలీలు ఉండరు.. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం శ్రామికులకే దక్కుతుందని బాబాసాహెబ్ అభిప్రాయం వ్యక్తం చేసారు.. 

     బాబాసాహెబ్ ప్రతిపాదనలను వల్లభాయ్ పటేల్, జె.బి కృపలానీ అంగీకరించకపోవడంతో నెహ్రూ రాజేంద్రప్రసాద్ లకు కలగజేసుకోవలసిందిగా బాబాసాహెబ్ కోరగా వారు కూడా కొన్ని అంశాలను మాత్రమే ఆమోదించడం జరిగింది.. 

✿ స్టేట్ సోషలిజం – మార్క్సిజం – వ్యత్యాసాలు ✿

1. మార్క్సిజం ముఖ్యంగా వర్గ పోరాటాలనే గుర్తిస్తుంది., ప్రభుత్వ యంత్రాంగాలైన పాలన వ్యవస్థ, రాజకీయ నాయకులు, పోలీసు వంటివన్నీ పెట్టుబడిదారీవర్గాల సహచరులుగానే గుర్తిస్తుంది.. కాబట్టి ప్రభుత్వాలను కూడా వర్గశత్రువుగా భావిస్తుంది,, ప్రభుత్వ వ్యవస్థ అంతాన్నే కోరుకుంటుంది., అంతిమంగా ఒక నియంత ఆధ్వర్యంలో, ప్రభుత్వ యంత్రాంగాల అజమాయిషీ లేని శ్రామికుల అధికార స్థాపనకు పూనుకుంటుంది.. 

— స్టేట్ సోషలిజం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది., సామాజిక రుగ్మతలు, ఆర్థిక వ్యత్యాసాలు దూరం చేయగలిగేందుకు ప్రభుత్వాల అవసరాన్ని గుర్తిస్తుంది., కాబట్టి ప్రభుత్వ వ్యవస్థ అంతం కావాలని కోరుకోదు., సోషలిజాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంచుతుంది..

2. సామాజిక మార్పు, శ్రామిక వర్గాలకు న్యాయం రక్తపాతం ద్వారానే సాధ్యం అని కమ్యూనిజం నమ్మితే, శ్రామికుల బాధితుల కలయికతో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాల ఏర్పాటు ద్వారా చట్టాల రూపకల్పన ద్వారానే మార్పు సాధ్యం అని స్టేట్ సోషలిజం ప్రవచిస్తుంది..

3. అధికార వికేంద్రీకరణ జరిగి బలహీన పాలనా యంత్రాంగాలు ఏర్పడడం వలన ప్రజలు శక్తివంతులౌతారని కమ్యూనిజం నమ్ముతుంది.. ఎం.ఎన్.రాయ్ వంటివారైతే ర్యాడికల్ డెమక్రసీ పేరుతో కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్విర్యం అయ్యి, బలమైన స్థానిక పాలనా వ్యవస్థలు ప్రజల కమిటీల రూపంలో రావాలని వాదిస్తాడు.. ఇవన్నీ భారతదేశన్ని నిర్విర్య పరిచేవే., స్థానికంగా ఆర్థికంగా బలమైన కులాల చేతుల్లో పెత్తనం పెట్టే సిద్ధాంతాలే., గాంధీ కూడా ఇదే వాదాన్ని “గ్రామ స్వరాజ్యా”ల పేరుతో ప్రతిపాదించాడు.. ఇప్పటి ఖాఫ్ పంచాయితీల ఆగడాలు చూస్తే ఇవి ఎంత ప్రమాదకరమైన ప్రతిపాదనలో అర్థం అవ్వాలి..

— బాబాసాహెబ్ సూత్రీకరణ, అధికార కేంద్రీకరణ ద్వారా బలమైన కేంద్రాలను తయారు చేస్తూనే, స్టేట్ సోషలిజాన్ని నియతృత్వం ద్వారా కాకుండా ప్రజాస్వామ్యం ద్వారా అమలు చేయడం వలన వికేంద్రీకరణకు అవకాశం ఇచ్చి రెండింటినీ సమతుల్యం చేయవచ్చుని నిర్వచించింది

✌☞ పై విషయాలు గమనిస్తే భారతదేశ సామాజిక భౌగోళిక, భౌతిక పరిస్థితులకు మార్క్సిజం కంటే స్టేట్ సోషలిజమే సరైనదని అర్థం అవుతుంది.. 

✿ స్టేట్ సోషలిజం – అంబేద్కరిస్టు ఉద్యమ సంఘాల పాత్ర ✿

☆ అంబేద్కరిస్టు సంస్థలు సామాజిక అంశాలతో పాటు అంబేద్కర్ ఆలోచనా విధానం నుండి ఆర్ధిక – రాజకీయ సూత్రాలను కూడా విస్తృతంగా అధ్యయనం చేసి, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది..

☆ లక్ష్యాల నిర్దేశంలో “స్టేట్ సోషలిజం” ప్రాముఖ్యత గుర్తించకపోతే పూర్తి స్థాయి విజయం సాధించలేమని గమనించాలి..

☆ సామాజిక ఉద్యమాలను పూర్తి స్థాయిలో నిర్వహించకుండా రాజకీయ ఉద్యమాల వైపు పయనించే విషయంలో సైద్ధాంతిక తప్పిదాలకు తావు లేకండా, ఉద్యమాల దిశానిర్దేశం కోసం బాబాసాహెబ్ సిద్ధాంతాల సహాయం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు..

☆ అంబేద్కరిస్టు సంస్థలు పరస్పర సహకారంతో ఒక ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుంటే మరింత ఉపయోగకరం..

బహుజన హితాయ.!!

బహుజన సుఖాయ.!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: